: దేశంలో ఉగ్రవాదం కంటే ప్రేమే ఎక్కువమందిని పొట్టనపెట్టుకుంటోంది!.. విస్తుగొలుపే వాస్తవాలు వెల్లడి
అవును.. దేశంలో ఉగ్రవాదం కారణంగా బలవుతున్నవారికంటే ప్రేమ వల్ల బలవుతున్న వారి సంఖ్య ఆరు రెట్లు ఎక్కువ. 2001-2015 మధ్య గణాంకాలను విశ్లేషించినప్పుడు విస్తుగొలిపే ఈ వాస్తవం బయపడింది. ఈ మధ్యకాలంలో దేశంలో 38,585 హత్యలు, ద్వేషపూరిత హత్యల కేసులు నమోదయ్యాయి. అలాగే 79,189 ఆత్మహత్యలు, 2.6 లక్షల కిడ్నాపులు నమోదయ్యాయి. పెళ్లే లక్ష్యంగా ఈ కిడ్నాపులు జరగడం గమనార్హం. వీటిలో సగటున ఏడు హత్య కేసులు, 14 ఆత్మహత్యలు, 47 కిడ్నాపులకు ప్రధాన కారణం ప్రేమ. ఇక ఇదే కాలంలో ఉగ్రవాదం కారణంగా 20 వేలమంది మరణించారు. వీరిలో సామాన్య పౌరులు, భద్రతా సిబ్బంది కూడా ఉన్నారు.
ఇక ప్రేమ కారణంగా ఎక్కువమంది హత్యకు గురవుతున్న వారిలో ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు, మధ్యప్రదేశ్ తర్వాతి స్థానంలో ఆంధ్రప్రదేశ్ (తెలంగాణ సహా) నిలిచింది. 2001-15 మధ్య కాలంలో పైన చెప్పుకున్న రాష్ట్రాల్లో 3 వేల కేసులు నమోదయ్యాయి. ఎక్కువ జనాభా కలిగిన రాష్ట్రాల్లో ఎక్కువ సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. ఈ మొత్తం కేసులకు ఏదో రకంగా ప్రేమతో లింకులు ఉండడం గమనార్హం.
ఇక ప్రేమ కారణంగా ఆత్మహత్యలకు పాల్పడిన వారు పశ్చిమబెంగాల్‌లోనే ఎక్కువ. అక్కడ 14 ఏళ్ల కాలంలో (2012 గణాంకాలు లభ్యం కాలేదు) ఏకంగా 15 వేల మంది ప్రేమ కారణాలతో ఆత్మహత్యలకు పాల్పడ్డారు. 9,405 ఆత్మహత్యలతో తమిళనాడు ఆ తర్వాతి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత వరుసగా అస్సాం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఒడిశా, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు నిలిచాయి. ఆయా రాష్ట్రాల్లో 5 వేల మంది చొప్పున ఆత్మహత్యలకు పాల్పడ్డారు. పురుషుల కంటే మహిళలే ఎక్కువగా ఆత్మహత్యలకు పాల్పడ్డారు. తాజా గణాంకాలను బట్టి చూస్తే ఉగ్రవాదం కారణంగా ప్రాణాలు కోల్పోతున్న వారితో పోలిస్తే ప్రేమ కారణంగా ప్రాణాలు కోల్పోతున్నవారి సంఖ్య ఆరు రెట్లు అధికమని గణాంకాలు చెబుతున్నాయి.