: దేవసేనను ప్రేమించి పెళ్లి చేసుకునే అమరేంద్ర బాహుబలి... రాజమౌళి చెప్పిన కబుర్లు!
కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు? గత రెండేళ్లుగా నలుగుతున్న ఈ ప్రశ్నకు మరో 27 రోజుల్లో సమాధానం తెలిసిపోతుంది. ఇక, 'బాహుబలి: ది కన్ క్లూజన్' చిత్రానికి సంబంధించిన పలు విషయాలను, ఓ కార్యక్రమంలో భాగంగా దర్శకుడు రాజమౌళి పంచుకున్నారు. ఈ సినిమాలో అత్యంత కీలకమైన పాత్రల గురించి వివరించారు. అమరేంద్ర బాహుబలి సవతి తల్లిగా శివగామి అద్భుత నటనను కనబరిచారని చెప్పారు. దేవసేనను అమరేంద్ర బాహుబలి ప్రేమించి పెళ్లి చేసుకుంటాడని, దేవసేన, శివగామి మధ్య నడిచే సుమారు 30 నిమిషాల సన్నివేశాలు చిత్రానికి ఎంతో కీలకమని చెప్పుకొచ్చారు. ఈ పాత్రలు తన చిత్రంలో ఉండటం అదృష్టమని, వీరు సినిమాకు ఎంతో బలమని అన్నారు. ఇదే కార్యక్రమంలో పాల్గొన్న భల్లాలదేవుడు రానా మాట్లాడుతూ, తాను సినిమాల్లోకి వచ్చి ఏడేళ్లు కాగా, బాహుబలితోనే ఐదేళ్లు గడిచిపోయాయని అన్నాడు. సినీ ప్రపంచానికి చెందిన ఎన్నో విషయాలను బాహుబలి తనకు నేర్పిందని తెలిపాడు.