: నవ్యాంధ్రలో జెన్-4 పార్క్.. ఏర్పాటుకు ముందుకొచ్చిన మలేషియా
నవ్యాంధ్రలో నాలుగో తరం (జెన్-4) టెక్నాలజీ పార్క్ ఏర్పాటుకు మలేషియా ఇండస్ట్రీస్, గవర్నమెంట్ గ్రూప్ ఫర్ హైటెక్ (ఎంఐజీహెచ్-మైట్) ముందుకొచ్చింది. ఈ మేరకు మైట్ టెక్నాలజీ నర్చరింగ్ (ఎంటీఎన్) సంస్థతో శనివారం ఏపీ ఎకనమిక్ డెవలప్ మెంట్ బోర్డు శనివారం ఢిల్లీలో ఒప్పందం కుదుర్చుకుంది. హైదరాబాద్ హౌస్‌లో జరిగిన కార్యక్రమంలో ప్రధాని నరేంద్రమోదీ, మలేషియా ప్రధాని మహ్మద్ నజీబ్ తున్ రజాక్ సమక్షంలో ఒప్పందం జరిగింది. ఏపీ ఈడీబీ సీఈవో జె.కృష్ణకిశోర్, ఎంటీఎన్ అధికారులు ఒప్పంద పత్రాలపై సంతకం చేశారు.
తాజా ఒప్పందం ప్రకారం ఏపీలో రెండు దశల్లో జెన్-4 పార్క్‌లను ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం మలేషియా సంస్థ రూ.2800 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన బయో డీగ్రేడబుల్ టెక్నాలజీతో తొలిదశలో, ఐవోటీ-రోబోటిక్స్-ఆటోమిషన్ టెక్నాలజీలకు సంబంధించి మలిదశలో పార్కులను ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం ఈడీబీతో మలేషియా సంస్థ చర్చలు జరిపింది. రెండు పార్క్‌లను ఒకేచోట ఏర్పాటు చేయాలా? లేక వేర్వేరుగా ఏర్పాటు చేయాలా? అన్న విషయంపై చర్చలు జరుగుతున్నాయి. ఈ రెండు పార్క్‌లకు రాజధాని అమరావతి ప్రాంతంలోకానీ, తీర నగరం విశాఖపట్టణంలో కానీ భూమి కేటాయించే అవకాశం ఉంది.