: ఏపీలో విద్యావంతులు వివాహాలు చేసుకోవడం లేదు... చేసుకున్నా పిల్లల్ని కనడం లేదు: చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ లో విద్యావంతులు వివాహం చేసుకోవడం లేదని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడలోని గన్నవరం సమీపంలోని ఆత్కూరులోని స్వర్ణ భారతి ట్రస్టు శిక్షణ కేంద్రం భవనాన్ని ప్రారంభించిన సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, చాలా గ్రామాల్లో నైపుణ్యం కలిగిన వ్యక్తులు దొరకడం లేదని అన్నారు. గ్రామాల్లో ప్రతి ఒక్కరికీ స్కిల్ డెవలెప్ మెంట్ అవసరమని ఆయన చెప్పారు. ఏపీలో జనాభా నియంత్రణ గురించి విస్తృతంగా ప్రచారం చేశామని ఆయన అన్నారు. దీంతో ఇప్పుడు ఏపీలో జనాభా పెరగడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. చదువుకున్న వాళ్లు వివాహాలు చేసుకోవడం మానేశారని, వివాహం చేసుకున్న వారు పిల్లల్ని కనడం మానేశారని ఆయన అన్నారు. ఒకప్పుడు కుటుంబ నియంత్రణ గురించి మాట్లాడిన తాను ఇప్పుడు ఎంత మందిని కన్నా ఫర్వాలేదని చెబుతున్నానని ఆయన తెలిపారు.