: నేటి నుంచే ఎస్ బీఐ బాదుడు కార్యక్రమం... కనీస నిల్వ, ఏటీఎం, జమలు అన్నింటిపైనా చార్జీలు!
దేశంలోనే అదిపెద్ద బ్యాంకు స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఎస్ బీఐ) నేటి నుంచే ఖాతాదారులపై అనేక రూపాల్లో చార్జీలు, జరిమానాల రూపంలో బాదుడు కార్యక్రమాన్ని మొదలు పెడుతోంది. ఎస్ బీఐలో స్టేట్ బ్యాంకు ఆఫ్ హైదరాబాద్, స్టేట్ బ్యాంకు ఆఫ్ పటియాలా, స్టేట్ బ్యాంకు ఆఫ్ మైసూరు, స్టేట్ బ్యాంకు ఆఫ్ జైపూర్ అండ్ బికనీర్, స్టేట్ బ్యాంకు ఆఫ్ ట్రావెన్ కోర్, భారతీయ మహిళా బ్యాంకులు విలీనం అవుతున్నది కూడా నేడే. అంటే ఆయా బ్యాంకులకు చెందిన ఖాతాదారులు సైతం ఎస్ బీఐ ఖాతాదారులుగా మారబోతున్నారు. దీంతో ఎస్ బీఐ వడ్డన వారిపైనా ఉండనుంది. మొత్తం మీద 31 కోట్ల మందిపై ఈ ప్రభావం పడనుంది.
మెట్రో నగరాల్లో గతంలో కనీస నిల్వ (అంటే ఖాతాలో ఎప్పుడూ ఉంచాల్సిన కనీస నెలవారీ నిల్వ) రూ.1,000గా ఉండేది. దాన్ని నేటి నుంచి రూ.5,000 చేసింది. అర్బన్ ప్రాంతాల్లో దీన్ని రూ.3,000, సెమీ అర్బన్ ప్రాంతాల్లో రూ.2,000, గ్రామీణ ప్రాంతాల్లో రూ.1,000కి పెంచేసింది. ఈ కనీస నిల్వలను ఉంచకపోతే ఆయా ఖాతాదారులపై ఒక నెలలో రూ.20 నుంచి రూ.100 వరకు జరిమానా విధిస్తుంది. ఏటీఎం చార్జీల విషయానికొస్తే... సొంత బ్యాంకు ఏటీఎంలలో నెలలో ఐదు ఉచితం. ఆ తర్వాత ప్రతీ లావాదేవీపైనా రూ.10 చెల్లించుకోవాలి. వేరే బ్యాంకు ఏటీఎంలలో నెలలో మూడు దాటితే రూ.20 చొప్పున ప్రతీ లావాదేవీపై చార్జీ పడుతుంది. కాకపోతే కొద్దిగా ఊరట ఏమంటే ఖాతాలో రూ.25,000 బ్యాలన్స్ ఉన్నవారిపై సొంత బ్యాంకు ఏటీఎంలలో ఎన్ని లావాదేవీలు చేసినా చార్జీలుండవని ఎస్ బీఐ ప్రకటించింది. ఇక నెలలో సొంత బ్యాంకు శాఖలో నగదు జమలు మూడు దాటితే చార్జీలు పడతాయి.