: చంద్రబాబుతో బాలయ్య భేటీ... మంత్రివర్గంలోకి 11 మందికి చాన్స్


ముఖ్యమంత్రి చంద్రబాబుతో హిందూపురం ఎమ్మెల్యే, నటుడు నందమూరి బాలకృష్ణ ఈ రోజు విజయవాడలో భేటీ అయ్యారు. ఆదివారం ఉదయం మంత్రివర్గ విస్తరణ జరగనున్న నేపథ్యంలో వీరి భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. మంత్రివర్గంలో మార్పులు, చేర్పుల విషయంలో బాలకృష్ణ తన అభిప్రాయాలను ముఖ్యమంత్రికి తెలియజేయనున్నట్టు తెలుస్తోంది. ఇక మంత్రివర్గ విస్తరణలో తమకూ ఓ అవకాశం కల్పించాలంటూ విజయవాడలోని సీఎం కార్యాలయానికి సీనియర్ టీడీపీ నేతలు క్యూ కడుతున్నారు. చంద్రబాబును కలిసి విన్నపాలు చేసుకుంటున్నారు. అదే సమయంలో మంత్రివర్గంలో చోటు కోల్పోయే అవకాశం ఉన్న వారు సైతం ముఖ్యమంత్రిని కలసి తమను కొనసాగించాలని వేడుకుంటున్నారు. దీనికి ఆయన చూద్దామని చెప్పి పంపిస్తున్నారు.

రెండున్నర సంవత్సరాల తర్వాత తొలిసారిగా మంత్రివర్గ విస్తరణ జరగనుంది. మొత్తం మంత్రివర్గంలో కొత్తగా 11 మందికి అవకాశం ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం మంత్రివర్గంలో 20 మంది ఉన్నారు. మరో ఆరుగురి వరకూ తీసుకునే అవకాశం ఉంది. దీంతో ఉన్నవారిలో ఐదుగుర్ని తప్పించే అవకాశం ఉంది. నారా లోకేశ్, భూమా అఖిలప్రియలకు ఛాన్స్ ఖాయమైంది. విప్ గా ఉన్న కాల్వ శ్రీనివాసులకు పదోన్నతి దక్కే అవకాశం ఉంది.

పదవులను కోల్పోయే వారిలో కిమిడి మృణాళిని, పీతల సుజాత, రావెల కిశోర్ బాబు, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి తదితరులు ఉన్నట్టు సమాచారం. పల్లె రఘునాథరెడ్డి, కొల్లు రవీంద్ర స్థానాలపైనా సందిగ్ధత నెలకొంది. మృణాళినిని తప్పిస్తే కనుక కళా వెంకట్రావుకు చోటు దక్కుతుందని చెబుతున్నారు. శాసనసభలో వాగ్ధాటితో ప్రతిపక్షాన్ని ఇరుకునబెట్టడంలో ముందుంటున్న మంత్రి అచ్చెన్నకు మంచి శాఖను ఇవ్వడం ద్వారా ప్రోత్సహించనున్నట్టు తెలిసింది. 

  • Loading...

More Telugu News