: ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటపై దాడి... పెళ్లికూతురు కిడ్నాప్
ఓ ప్రేమజంట తాము పెళ్లి చేసుకుంటామని చెబితే, వారి కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదు. కులం పేరు చెప్పి వారు ఒకటి కావద్దంటూ పెళ్లికి అడ్డుచెప్పారు. దీంతో ఆ జంట ఇంటి నుంచి పారిపోయి తిరుపతికి వెళ్లి పెళ్లి చేసుకుంది. అయితే, తమ కూతురు కనిపించడం లేదంటూ పెళ్లి కూతురి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసుకుని ఆమె కోసం వెతుకుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఆ జంట పోలీసుస్టేషన్ లో తమ ప్రేమ వ్యవహారం చెప్పేందుకు తిరుపతి నుంచి కారులో బయలుదేరగా వారి గురించి సమాచారం తెలుసుకున్న పెళ్లి కూతురి అన్న, అతని మిత్రులు మరో కారులో వారి కారును వెంబడించి అడ్డుకుని పెళ్లికొడుకుపై దాడి చేశారు. కారు అద్దాలను పగులగొట్టి పెళ్లి కూతురిని బలవంతంగా తమ కారులో ఎక్కించుకుని వెళ్ళారు.
ఈ ఘటనపై పోలీసులు వివరాలు తెలుపుతూ... తమిళనాడులోని కాంచీపురం జిల్లా చెంగల్పట్టు సమీపంలోని వీరాపురానికి చెందిన కన్నియప్పన్ కుమార్తె రమ్య (20) ఓ ప్రైవేటు కంపెనీలో పని చేస్తూ ఈచ్చంకరనైకి చెందిన కారు డ్రైవర్ పశుపతి (25)ని ప్రేమించిందని తెలిపారు. రమ్య, పశుపతి రెండేళ్లుగా ప్రేమించుకున్నారని తెలిపారు. పెద్దలు వారి పెళ్లికి అడ్డుతగలడంతో వారు అక్కడి నుంచి తిరుపతికి వెళ్లి పెళ్లి చేసుకున్నారని చెప్పారు. తాము ప్రస్తుతం నవ వధువు రమ్య కోసం గాలిస్తున్నామని తెలిపారు.