: మండిపోతున్న ఎండలు.. పాతికేళ్ల రికార్డు బద్దలు
ఎండలు ఠారెత్తిస్తున్నాయి.. భానుడి భగభగకు ప్రజలు చమటలు కక్కుతున్నారు. మాములుగా కాదు.. గత పాతికేళ్లలో ఎప్పుడూ లేనంత స్థాయిలో సూర్యుడు నిప్పులు కురిపిస్తున్నాడు. చలి వాతావరణం ఉండే ఉత్తరాఖండ్‌లో నమోదైన ఉష్ణోగ్రతలే ఇందుకు నిదర్శనం. ఆ రాష్ట్రంలో సరిగ్గా 25 ఏళ్ల నాటి ఎండల రికార్డు తాజాగా బద్దలైంది. భానుడి ప్రతాపంపై వాతావరణ శాఖ అధికారులు మాట్లాడుతూ.. డెహ్రాడూన్, పంత్‌నగర్, ఉధమ్‌సింగ్‌నగర్ ప్రాంతాలలో ఎండలు మండిపోతున్నాయని తెలిపారు. ప్రస్తుతం అక్కడ ఎండలు 35-36 డిగ్రీల స్థాయిలో ఉన్నాయని, ప్రజలు జాగ్రత్త వహించాలని చెబుతున్నారు.
1991 మార్చి 31వ తేదీన పంత్‌నగర్‌లో 36.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని, మొన్నటివరకు అదే అత్యధికంగా ఉన్న ఉష్ణోగ్రత నిన్న దాన్ని దాటేసి 36.9 డిగ్రీలుగా నమోదైందని తెలిపారు. ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్‌లో ఉష్ణోగ్రత 35.8 డిగ్రీలకు పెరిగిందని, 2001 తర్వాత అక్కడ ఇంత స్థాయిలో ఉష్ణోగ్రత నమోదు కావడం ఇదే తొలిసారని చెప్పారు. దేశంలోని మిగిలిన ప్రాంతాల్లో కూడా ఉష్ణోగ్రతలు అధికంగానే ఉన్నాయని, గుజరాత్‌లో ఈ వారం ప్రారంభంలో 40-42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని తెలిపారు.