: పార్టీ చేసుకున్న ఇద్దరు యువతులు అనుమానాస్పద స్థితిలో మృతి
ఎంతో ఉత్సాహంగా పార్టీ చేసుకున్న ఇద్దరు యువతులు అనంతరం అనుమానాస్పద స్థితిలో ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆస్పత్రిలో మరణించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ యువతుల మరణానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. దక్షిణ ఢిల్లీలోని వసంత విహార్ ప్రాంతంలో ఆ ఇద్దరమ్మాయిలు ఓ ఇంట్లో పార్టీకి వెళ్లారని, అయితే, అనంతరం వారి ఆరోగ్యం బాగా దెబ్బ తిందని తెలిపారు. వారిద్దరి పేర్లు క్లారా, రకీమ్ అని పేర్కొన్నారు. వీరు డ్రగ్స్ అధిక మోతాదులో తీసుకోవం వల్లే మృతి చెంది ఉండవచ్చని తాము అనుమానిస్తున్నట్లు తెలిపారు. వారిరువురికీ డ్రగ్స్ అలవాటు ఉన్నట్లు తమతో వారి స్నేహితులు చెప్పారని పోలీసులు అన్నారు. ఈ ఇద్దరు అమ్మాయిలకు గత కొన్నేళ్లుగా పరిచయం ఉందని, క్లారా కొన్నాళ్లు తన మరో స్నేహితురాలు జెన్నీతో ఉండి, తర్వాత బంధువులతో కలిసి ఓ ఫ్లాట్‌లో ఉంటోందని పోలీసులు చెప్పారు.
తాము రాత్రి 11 గంటల వరకు పార్టీ చేసుకున్నామని జెన్నీ, ఆ తరువాత తాను వెళ్లిపోయానని, అయితే క్లారా, రకీమ్ ఇద్దరూ తాగుతూ పార్టీ చేసుకున్న తమ ఇంటి దగ్గరే ఉన్నారని తెలిపింది. తెల్లవారుజామున 6 గంటలకు తాను తిరిగొచ్చే సరికి గది లోపలి నుంచి గడియ పెట్టి ఉందని చెప్పింది. తాము కిటికీ తెరిచి లోపలకు వెళ్లామని అయితే, ఆ ఇద్దరూ నేల మీద పడి ఉన్నారని చెప్పింది. వెంటనే వారిని ఆసుపత్రికి తరలించినా లాభం లేకుండా పోయిందని చెప్పింది.