: మహిళా ఎమ్మెల్సీతో బీజేపీ ఎమ్మెల్యే అసభ్య ప్రవర్తన.. అసెంబ్లీ ప్రాంగణంలో చితక్కొట్టుకున్న ఎమ్మెల్యేలు
బీహార్ అసెంబ్లీ ప్రాంగణంలో ఇద్దరు శాసనసభ్యులు ముష్టిఘాతాలు కురిపించుకున్నారు. బుధవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బుధవారం మండలిలోని మెట్లు ఎక్కుతున్న సమయంలో లోక్‌జనశక్తి పార్టీకి చెందిన నూతన్ సింగ్‌తో బీజేపీ ఎమ్మెల్యే లాల్ బాబు ప్రసాద్ అనుచితంగా ప్రవర్తించారు. దీంతో ఈ విషయాన్ని ఆమె తన భర్త, బీజేపీ ఎమ్మెల్యే నీజర్ కుమార్ సింగ్‌తో చెప్పారు. ఆగ్రహంతో ఊగిపోయిన ఆయిన అసెంబ్లీని, మండలని కలిపే సన్నటి కారిడార్‌లో బాబు ప్రసాద్‌ను పట్టుకుని చితకబాదారు. ఇద్దరూ ఒకరిపై ఒకరు ముష్టిఘాతాలు కురిపించుకున్నారు.
అధికారపక్ష సభ్యులు ఈ విషయాన్ని శుక్రవారం మండలి చైర్‌పర్సన్ నారాయణ్‌సింగ్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో బాబు ప్రసాద్ వేధింపులపై విచారణ జరపాల్సిందిగా నైతిక విలువల కమిటీని ఆయన ఆదేశించారు. అంతేకాక పర్యావరణం, కాలుష్యంపై మండలి కమిటీ సభ్యత్వం నుంచి ప్రసాద్‌ను తొలగిస్తున్నట్టు చైర్‌పర్సన్ ప్రకటించారు. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన బీజేపీ ప్రసాద్ పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దు చేసింది. ఈమేరకు పార్టీ సీనియర్ నేత సుశీల్ కుమార్ మోదీ ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఆయనకు షోకాజ్ నోటీసు కూడా జారీ చేసినట్టు పేర్కొన్నారు.