: ఆఫర్ల హోరుతో కళకళలాడిన వాహన షోరూమ్‌లు.. హైదరాబాద్‌లో ఒక్కరోజే 10 వేలకుపైగా వాహనాల విక్రయం
ఆఫర్ల జడివానలో తడిసిముద్దయిన హైదరాబాద్‌వాసులు శుక్రవారం ఒక్కరోజే పదివేలకు పైగా వాహనాలను కొనుగోలు చేసి ఇంటికి తీసుకెళ్లారు. భారత్ స్టేజ్ (బీఎస్-3) వాహనాల విక్రయాలకు మార్చి 31 చివరి రోజు కావడంతో వాహన కంపెనీలు భారీ రాయితీలు ప్రకటించాయి. దానికి అదనంగా డీలర్లు మరికొన్ని ఆఫర్లు ప్రకటించడంతో వాహనాల కొనుగోలుకు నగరవాసులు పోటెత్తారు. దీంతో వాహన షోరూములు కిటకిటలాడాయి. వినియోగదారుల తాకిడికి కొన్ని షోరూముల ఎదుట నోస్టాక్ బోర్డులు కూడా కనిపించాయి.
ఏప్రిల్ 1 నుంచి బీఎస్-4 వాహనాలను మాత్రమే విక్రయించాలన్న సుప్రీంకోర్టు తీర్పుతో తమ వద్ద ఉన్న బీఎస్-3 వాహనాలను వదిలించుకునేందుకు వివిధ వాహన కంపెనీలు ద్విచక్ర వాహనాలపై రూ. 10 వేల నుంచి రూ.12 వేల వరకు తగ్గింపు ధరలు ప్రకటించాయి. ఇక కార్లపై అయితే ఏకంగా రూ.50- రూ.70 వేల మధ్య డిస్కౌంట్ ప్రకటించాయి. దీంతో అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు వినియోగదారులు పోటెత్తారు. గురువారం 9,800 బీఎస్-3 వాహనాలు అమ్ముడు పోగా శుక్రవారం ఆ సంఖ్య 10,500కు చేరుకుంది. వీటిలో 8,950 ద్విచక్ర వాహనాలు కాగా మిగతావి కార్లు, ఇతర వాహనాలు ఉన్నాయి.