: ఊహాగానాలకు తెరదించిన సూపర్‌స్టార్.. రాజకీయాల్లోకి వచ్చేది లేదంటూ తెగేసి చెప్పిన రజనీకాంత్
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ ప్రవేశం చేయనున్నారనే ఊహాగానాలకు తెరపడింది. తనకు రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం లేదని రజనీకాంత్ స్పష్టం చేశారు. రేపటి (ఆదివారం) సమావేశాన్ని అభిమానులే ఏర్పాటు చేసుకున్నారని, ఆరోజు వారిని కలుసుకోవాల్సి ఉన్నా వీలుపడకపోవడంతో ఈనెల 11-16 మధ్య ఏదో ఒకరోజు వారిని కలుసుకుంటానని రజని పేర్కొన్నారు. తనతో ఫొటోలు తీసుకునేందుకే ఈ సమావేశమని స్పష్టం చేశారు. అంతేతప్ప దీనికి ఎటువంటి ప్రాధాన్యం లేదని, ఆ రోజు సంచలన ప్రకటన ఉండబోదని కుండబద్దలు కొట్టారు.
కాగా, శుక్రవారం చెన్నై పర్యటనకు వచ్చిన మలేసియా ప్రధాని మహమ్మద్ నజీబ్ బిన్ తున్ అబ్దుల్ రజాక్ పోయెస్ గార్డెన్‌లోని రజని ఇంటికి వెళ్లారు. రజని సతీమణి లత, కుమార్తె ఐశ్వర్య ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రజనీతో రజాక్ సెల్ఫీ దిగి ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. రజాక్‌తో భేటీ అనంతరం రజని మాట్లాడుతూ చెన్నై ఎప్పుడొచ్చినా తన ఇంటికి రావాలన్న విన్నపాన్ని అంగీకరించి ఇంటికి రావడం గౌరవంగా భావిస్తున్నానన్నారు. మలేసియాలో ‘కబాలి’ షూటింగ్ జరుగుతున్న సమయంలో రెండు నెలలపాటు రజాక్ తనకు మర్చిపోలేని ఆతిథ్యం ఇచ్చారని ఈ సందర్భంగా రజనీకాంత్ గుర్తు చేసుకున్నారు.