: చివరి క్షణాల్లో ‘జియో’ నుంచి మరో బంపర్ బొనాంజా.. ప్రైమ్ మెంబర్‌షిప్ గడువు పొడిగింపు!
ప్రైమ్ మెంబర్‌షిప్ సభ్యత్వం ముగుస్తున్న వేళ చివరి క్షణాల్లో ఆర్‌జియో మరో బంపర్ ఆఫర్ ప్రకటించింది. వినియోగదారుల నుంచి వస్తున్న అనూహ్య స్పందనతో ప్రైమ్ మెంబర్‌షిప్ గడువును మరో 15 రోజులు పెంచింది. అంటే ఏప్రిల్ 15 వరకు సభ్యత్వాన్ని పొందవచ్చు. జియో తాజా ప్రకటనతో వినియోగదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రైమ్ మెంబర్‌షిప్‌ను పొందేందుకు చివరి రోజైన మార్చి 31న వినియోగదారులు ఆన్‌లైన్‌లో పోటెత్తారు. దీంతో జియో వెబ్‌సైట్ సర్వర్ డౌన్ అయింది. అదే పరిస్థితి జియో యాప్‌కు ఎదురైంది. సైట్ నెమ్మదిగా ఓపెన్ కావడంతో వినియోగదారులు నిరాశ చెందారు. దీంతో కస్టమర్ కేర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదులు చేశారు. వినియోగదారుల అసౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని జియో ఈ గడువును పొడిగించినట్టు తెలుస్తోంది.
కాగా, ప్రైమ్ మెంబర్‌షిప్ గడువును పెంచడంతోపాటు జియో మరో ఆఫర్ కూడా ప్రకటించింది. జియో గతంలో ప్రకటించిన రీచార్జ్ ప్లాన్లను బట్టి రూ.303తో రీచార్జ్ చేసుకుంటే నెల రోజులపాటు మాత్రమే అపరిమిత వాయిస్ కాల్స్, డేటా సేవలు లభించేవి. ఇప్పుడు దానిని మూడు నెలలకు పెంచింది. అంటే ఒకసారి రూ.303తో రీచార్జ్ చేసుకుంటే జూన్ చివరి వరకు ఉచిత సేవలు పొందవచ్చన్నమాట. ఇప్పటి వరకు 7 కోట్లమందికి పైగా ప్రైమ్ సభ్యత్వం తీసుకున్నట్టు జియో తెలిపింది.