: రాబోయే శాసనసభ సమావేశాల్లో రెడ్‌లైన్ పెట్టాలి, అది దాటి వస్తే ఇక చర్యలే : అసెంబ్లీలో చంద్రబాబు ఆగ్రహం
శాసనసభలో ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యుల తీరుపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజు ఆగ్రహం వ్యక్తంచేశారు. శాసనసభలో చర్చ జరుగుతున్న సబ్జెక్ట్‌పై మాట్లాడకుండా వేరే విషయాలను మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. ‘ఈ సభలో ప్రతిరోజు చూస్తున్నాం.. ఇదే తీరు కనపడుతోంది.... సభకి ఓ హుందాతనం ఉంటుంది.. దాన్ని కాపాడేలా సభ్యులు వ్యవహరించాలి. వారికి రూల్స్ నేర్పించండి అధ్యక్షా.. శిక్షణ ఇవ్వండి.. సభలోనే గొడవలు చేస్తున్నారు’ అని చంద్రబాబు నాయుడు అన్నారు. సభలో ఇష్టానుసారంగా ఏదో ఒకటి మాట్లాడడానికి వీలు లేదని అన్నారు.
రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో రెడ్ లైన్ పెట్టి ఆ గీత దాటి వస్తే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చంద్రబాబు నాయుడు అన్నారు. కనీసం ఒక్క క్వశ్చన్ అవర్ నయినా సరిగ్గా జరగనిచ్చారా? అని ప్రశ్నించారు. తప్పనిసరిగా వచ్చే అసెంబ్లీలో రూల్స్ కఠిన తరం చేయాల్సి ఉందని అన్నారు. ప్రజా సమస్యలపై వైసీపీ సభ్యులు ఏ రోజైనా సక్రమంగా చర్చించారా? అని ప్రశ్నించారు.
ప్రశ్నోత్తరాలు జరగకుండా అడ్డుకున్నారని, పోడియంపైకి ఎక్కి ఆందోళన చేస్తున్నారని అన్నారు. కరవు అంశంపై ఒక్కరోజు కూడా మాట్లాడలేదని విమర్శించారు.