: నా చదువుపై ఆరోపణలు నిరూపించగలరా?: ఏపీ అసెంబ్లీలో చంద్రబాబు నాయుడికి జగన్ సవాల్!
తన చదువు గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో పలు ఆరోపణలు చేశారని, ఆ ఆరోపణలను సీఎం నిరూపించగలరా? అని ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అన్నారు. ‘చంద్రబాబు ఒకవేళ నా చదువుపై చేసిన ఆరోపణలు నిరూపించకపోతే రాజీనామా చేస్తారా?.. నేను సవాలు విసురుతున్నాను.. సవాల్ అధ్యక్ష.. సవాల్.. సవాల్.. నాకు చంద్రబాబు నాయుడి గారికి సవాల్.. అధికారం మీ చేతుత్లోనే ఉంది కదా రుజువు చేసుకోండి..’ అని జగన్ అన్నారు.
చంద్రబాబు నాయుడు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని, అన్నీ అబద్ధాలు మాట్లాడుతున్నారని జగన్ అన్నారు. తన చదువుకు సంబంధించిన ఆరోపణలు నిరూపించాలని పేర్కొన్నారు. జగన్ సవాలుపై మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ... సీఎంకి సవాల్ విసిరే అర్హతే జగన్‌కు లేదని అన్నారు. దీంతో మళ్లీ మాట్లాడిన జగన్.. తాను 5 లక్షల 45 వేల మెజార్టీతో గెలిచిన వాడినని జగన్ అన్నారు. రెండు సార్లు ఎంపీగా, ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచానని అన్నారు. ఇటువంటి మెజార్టీ చంద్రబాబు ఎంత ప్రయత్నం చేసినా రాదని అన్నారు. ఎవరిస్థాయి ఏమిటో ప్రజలకు తెలుసని అన్నారు.