: జగన్ ఒక్కడి వల్ల మిగతా అందరు ఎమ్మెల్యేలు బాధపడుతున్నారు: టీడీపీ ఎమ్మెల్యేలు
పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు ఘటనపై చర్చించాలంటూ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ సభ్యులు ఆందోళన చేసిన విషయం తెలిసిందే. వైసీపీ సభ్యుల తీరుపై అధికార పక్ష సభ్యులు అనిత, పల్లా శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశాలను అడ్డుకోవడమే వారి అజెండాగా మారిందని వారు అన్నారు. శాసనసభలో ప్రతిపక్ష పార్టీ అధినేత జగన్ తీరుతో వైసీపీ సభ్యులు కూడా తమ సమస్యలు ప్రస్తావించలేకపోతున్నారని వారు వ్యాఖ్యానించారు. నిన్న మొగల్తూరులోని ఆక్వా పరిశ్రమలో జరిగిన ప్రమాదాన్ని అడ్డుపెట్టుకుని సభను అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. జగన్ వల్ల సభలో మిగతా అందరు ఎమ్మెల్యేలు బాధపడుతున్నారని వారు వ్యాఖ్యానించారు.