: భారీ మంటల ధాటికి అమెరికాలో కూలిన హైవే బ్రిడ్జ్
అమెరికాలోని అట్లాంటా నగరంలో ఎల్లప్పుడూ బిజీగా ఉండే రూట్‌లో ఉన్న ఇంటర్‌స్టేట్ 85 హైవేపై బ్రిడ్జ్ కూలిపోయింది. అక్కడకు చేరుకున్న సహాయక సిబ్బంది బ్రిడ్జ్‌ను మరమ్మతు చేసే పనులు ప్రారంభించారు. ఈ ఘటనపై పలు వివరాలు వెల్లడిస్తూ.. అగ్ని ప్రమాదం వల్ల ఇంటర్‌స్టేట్-85 హైవే దెబ్బతిందని అక్కడి అధికారులు తెలిపారు. ఆ హైవేపై ఉన్న అన్ని లేన్లను మూసివేసినట్లు తెలిపారు. మొదట ఆ బ్రిడ్జ్ కింద మంటలు చెలరేగాయని, అర్ధగంట అనంతరం మంటల ధాటికి బ్రిడ్జి కూడా కూలిపోయిందని చెప్పారు. దీంతో వేలాది వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయని చెప్పారు. అట్లాంటా, ఫుల్టన్ కౌంటీల్లో ఎమర్జెన్సీ ప్రకటించినట్లు పేర్కొన్నారు. బ్రిడ్జ్ కింద నిలువ చేసిన పీవీసీ పైపులకు మంటలు అంటుకోవడం వల్లే ఈ ప్రమాదం సంభవించినట్లు అనుమానిస్తున్నారు.