: 70 మంది విద్యార్థినులపై దారుణంగా ప్రవర్తించిన మహిళా వార్డెన్!
ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్ నగర్‌లో దారుణం చోటుచేసుకుంది. అక్కడి కస్తూర్భా గాంధీ రెసిడెన్షియల్ స్కూల్‌కి చెందిన 70 మంది విద్యార్థినులపై ఆ హాస్టల్ వార్డెన్ దారుణంగా ప్రవర్తించింది. 70 మంది విద్యార్థినులను వరుసగా నిలబెట్టి వారి వస్త్రాలను తీయించి అమానుషంగా తనిఖీలు చేయించింది. ఆ మహిళా గార్డెన్ తీరు పట్ల ఆ విద్యార్థినుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. ఈ ఘటనపై మీడియాతో సదరు విద్యార్థునులు మాట్లాడుతూ ఆ వార్డెన్ తమను కొట్టిందని, బట్టలు విప్పేయకపోతే చావు దెబ్బలు తింటారని భయపెట్టి ఇలా చేయించిందని ఆవేదన చెందారు.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న సంబంధిత అధికారులు ఆ వార్డెన్‌ను ఉద్యోగం నుంచి సస్పెండ్ చేశారు. కాగా, ఈ ఘటనపై వార్డెన్ మాట్లాడుతూ... హాస్టల్ బాత్‌రూంలో రక్తపు మరకలు కనిపించాయని, సమస్యలు చెప్పేందుకు అమ్మాయిలు ఇబ్బంది పడే అవకాశం ఉండడంతోనే వారి ఆరోగ్యానికి హాని జరగకుండా చూడాలని తాను ప్రయత్నించానని చెప్పుకొచ్చింది. ఆ అమ్మాయి ఎవరో గుర్తించేందుకే తాను అలా చేశానని సమర్థించుకునే ప్రయత్నం చేసింది.