: నరేంద్ర మోదీ హత్యకు ఉగ్రవాదుల కుటిలయత్నం... ఎన్ఐఏ విచారణలో వెల్లడైన సంచలన నిజం
గత సంవత్సరం భారత ప్రధాని నరేంద్ర మోదీ, లక్నోలో ర్యాలీ జరిపిన వేళ, ఆయన్ను హత్య చేసేందుకు రామ్ లీలా మైదానంలో ప్రయత్నించామని ఉగ్రవాదులు చెప్పినట్టు జాతీయ దర్యాప్తు సంస్థ సంచలన విషయాన్ని వెల్లడించింది. మధ్యప్రదేశ్ లో ఉజ్జయిన్ పాసింజర్ రైలులో పేలుడు జరిపిన ఉగ్రవాదులే మోదీని హత్య చేసేందుకు విఫలయత్నం చేశారని అధికారులు తెలిపారు. ఈ కేసులో పోలీసులు అరెస్ట్ చేసిన ఉగ్రవాదులు మహ్మద్ డానిష్, ఆతిఫ్ ముజఫర్ తదితరులను విచారించగా, రామ్ లీలా మైదానంలో దసరా ఉత్సవాలకు ఒక రోజు ముందు అక్కడ పడివున్న ఓ చెత్తడబ్బాలో వీరు బాంబును కూడా అమర్చారని ఎన్ఐఏ అధికారులు తెలిపారు. ఆపై రెండు రోజుల తరువాత ఆతిఫ్ ముజఫర్ అక్కడికి వెళ్లి చూడగా, బాంబు మాయమై వైర్లు మాత్రమే కనిపించాయని, ఆ తరువాత కూడా డానిష్ పలు చోట్ల బాంబులను పేల్చి ఐఎస్ఐఎస్ సత్తాను చాటాలని వీరు భావించి విఫలమయ్యారని తెలిపారు. వీరు స్టీలు పైపులు, షాండ్లియర్ బల్బులను వాడి బాంబులు చేశారని, వీరికి భారత వాయుసేన మాజీ ఉద్యోగి సహకరించాడని ఎన్ఐఏ పేర్కొంది.