: మావోల ఘాతుకం... రైల్వేస్టేషన్ పేల్చివేత... ఏపీలో ఆగిన పలు రైళ్లు
ఆంధ్రా ఒడిశా సరిహద్దుల్లోని డోయకల్ రైల్వే స్టేషను వద్ద మావోయిస్టులు గత అర్ధరాత్రి బీభత్సం సృష్టించారు. ఆగివున్న గూడ్స్ రైలింజన్ ను బాంబులతో పేల్చివేసి, ఆపై స్టేషన్ ను నాశనం చేశారు. సుమారు 15 నుంచి 20 మంది నక్సల్స్ ఈ ఘటనలో పాల్గొన్నట్టు తెలుస్తోంది. వీరి దాడిలో సిబ్బందికి ఎటువంటి అపాయమూ కలుగలేదు. ఈ ఘటన కారణంగా పలు రైళ్లను దారిమళ్లించగా, కొన్నింటిని నిలిపివేశారు.
పూరి - అహ్మదాబాద్ ఎక్స్ ప్రెస్ ను రాయగఢ్ లో నిలిపివేశారు. ఎర్నాకుళం - హాతియా ఎక్స్ ప్రెస్ ను బొబ్బిలిలో, విశాఖ - దుర్గ్ పాసింజర్ రైలును జిమిడిపేటలో ఆపేశారు. కోరాపుట్ - సంబల్ పూర్ పాసింజర్ రైలును దారిమళ్లించగా, విశాఖ - రాయపూర్ పాసింజర్ ను గజపతి నగరంలో నిలిపివేశారు. భువనేశ్వర్ - జునాగఢ్ ఎక్స్ ప్రెస్ రైలును రాయగఢ్ లో నిలిపివేశారు. తిరుపతి - బిలాస్ పూర్ ఎక్స్ ప్రెస్ ను దారిమళ్లించారు.