: నెహ్రూ, ఇందిరాగాంధీ తర్వాత మోదీనే!: ప్రముఖ చరిత్రకారుడు రామచంద్ర గుహ
దేశంలోని అత్యంత విజయవంతమైన ప్రధానుల్లో ప్రధాని నరేంద్రమోదీ మూడో వ్యక్తి కాబోతున్నారని ప్రముఖ చరిత్రకారుడు రామచంద్ర గుహ జోస్యం చెప్పారు. మోదీ తన చరిష్మా, ఆకర్షణతో మతం, భాష హద్దులను కూడా చెరిపేస్తున్నారని ఆయన ప్రశంసించారు. మాజీ ప్రధానులు జవహర్‌లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీల తర్వాత అత్యంత విజయవంతమైన మూడో ప్రధానిగా మోదీ నిలవనున్నారని అన్నారు. ఇందుకు మోదీ తీసుకుంటున్న నిర్ణయాధికారం, ముందుచూపే కారణమని వివరించారు. నెహ్రూ, ఇందిర తర్వాత ఆ స్థాయిలో అధికారం, చరిష్మా, కులమత భేదాలు లేకుండా ప్రజలను ఆకర్షించిన ప్రధాని ఇంకెవరూ లేరన్నారు. హిందువుల కుల వ్యవస్థ అత్యంత కఠినమైనదని పేర్కొన్న గుహ, భారత రాజకీయ చరిత్రలో కుల వ్యవస్థ, మహిళా వివక్ష అనేవి తిరస్కరించలేని అంశాలని స్పష్టం చేశారు. ఢిల్లీలో గురువారం నిర్వహించిన లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ ఇండియా కార్యక్రమంలో పాల్గొన్న రామచంద్ర గుహ ఈ వ్యాఖ్యలు చేశారు.