: చనిపోయినా వైద్యం చేస్తున్నారని ఆగ్రహం.. ఆస్పత్రిలో వీరంగం.. వెంటిలేటర్‌పై రోగిని బలవంతంగా తీసుకుపోయిన వైనం!
తమ కుమారుడు చనిపోయినా వైద్యం చేస్తున్నారని ఆరోపిస్తూ బాధిత కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో ిధ్వంసం సృష్టించిన ఘటన హైదరాబాద్‌లో జరిగింది. సైఫాబాద్ పోలీసుల కథనం ప్రకారం.. అంబర్‌పేటలోని బతుకమ్మకుంటకు చెందిన సురేశ్ (15) తలనొప్పి, చెవిలోనుంచి చీముకారే సమస్యతో బాధపడుతుండడంతో మార్చి 27న లకడీకాపూల్‌లోని లోటస్ ఆస్పత్రిలో చేర్చారు. పరీక్షించిన వైద్యులు మెదడులో చీము చేరిందని చెబుతూ ఆపరేషన్ చేశారు. చికిత్స నిమిత్తం 29వ తేదీ వరకు రూ.1.50 లక్షల బిల్లు వసూలు చేశారు. ఆ తర్వాత అకస్మాత్తుగా సురేశ్ పరిస్థితి ఆందోళనకరంగా ఉందని, ఇంకా వైద్యం చేయాలని, డబ్బులు సిద్ధం చేసుకోవాలని బాధిత కుటుంబ సభ్యులకు వైద్యులు సూచించారు.
దీంతో ఇప్పటికే రూ.లక్షన్నర కట్టామని, ఇంకా డబ్బంటే తమకు సాధ్యం కాదని, అసలు సురేశ్‌కు ఏమైందని వైద్యులను నిలదీశారు. బాబు చనిపోయినా వైద్యం చేస్తున్నారని ఆరోపిస్తూ ఆస్పత్రి అద్దాలు, ఫర్నిచర్, పూలకుండీలు ధ్వంసం చేశారు. అనంతరం వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న సురేశ్‌ను అంబులెన్స్‌లో ఎక్కించారు. సమాచారం అందుకున్న సైఫాబాద్ ఇన్‌స్పెక్టర్ పూర్ణచందర్, ఎస్సై ప్రేమ్‌కుమార్‌లు బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడినా వినకుండా సురేశ్‌ను బలవంతంగా తీసుకెళ్లారు. ఆస్పత్రి ఆస్తికి నష్టం కలిగించిన ఫిర్యాదుపై వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. సురేశ్ చనిపోయాడనే భ్రమలోనే వారలా ప్రవర్తించారని, అతడు కోలుకునేందుకు ఇంకా సమయం పడుతుందని చెబుతున్నా వినలేదని వైద్యులు చెబుతున్నారు.