: ఏపీలో ఐటీ శకం ప్రారంభం.. రాష్ట్రానికి హెచ్సీఎల్.. రూ.500 కోట్లతో ఐటీ అభివృద్ధి కేంద్రం ఏర్పాటు
ఐటీ దిగ్గజం హెచ్సీఎల్ రూ.500 కోట్లతో ఆంధ్రప్రదేశ్లో ఐటీ అభివృద్ధి కేంద్రం ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది. ఈ కేంద్రం ద్వారా 5 వేల మందికి ఉపాధి కల్పనతోపాటు మరో 5 వేల మందికి నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ ఇవ్వనున్నారు. ఈ మేరకు గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబు, హెచ్సీఎల్ అధినేత శివనాడర్ సమక్షంలో ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి కె.విజయానంద్, నైపుణ్యాభివృద్ధి సంస్థ సీఈవో సిసోడియా, హెచ్సీఎల్ ఆర్అండ్డీ విభాగం వైస్ చైర్మన్ జీహెచ్రావు ఒప్పందాలు చేసుకున్నారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ హెచ్సీఎల్ వంటి దిగ్గజ ఐటీ సంస్థలు రాష్ట్రానికి రావడంతో నవ్యాంధ్రలో ఐటీ శకం ప్రారంభమైందన్నారు. తిరుమల వెంకన్న దర్శనానికి ఆరు నెలలకు ఓమారు రాష్ట్రానికి వచ్చే శివనాడర్ ఇకపై తన సంస్థ బాగోగులు చూసుకునేందుకు మూడు నెలలకోమారు రావాల్సి ఉంటుందంటూ చమత్కరించారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 980 ఐటీ కంపెనీలు ఉన్నాయని, వాటిలో పదిశాతం కంపెనీలను రాష్ట్రానికి రప్పించగలిగితే రాష్ట్ర యువతకు 10 లక్షల ఉద్యోగాలు వస్తాయని శివనాడర్ పేర్కొన్నారు. అలా చేయగలిగితే మైక్రోసాఫ్ట్ కూడా వస్తుందన్నారు. ఉద్యోగాలు చేసేందుకు గృహిణులు ముందుకొస్తే వారికి కూడా ఉపాధి అవకాశాలు కల్పిస్తామని అన్నారు. చంద్రబాబు భరోసాతోనే విజయవాడలో తమ సంస్థ కార్యకలాపాలు ప్రారంభిస్తున్నట్టు శివనాడర్ పేర్కొన్నారు.