: సచిన్, రేఖ, మేరీ కోమ్ లాంటి వారికి ఆసక్తి లేకపోతే రాజీనామా చేయకూడదా?: రాజ్యసభలో సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ
మాజీ క్రికెటర్ సచిన్ టెండుల్కర్, బాక్సర్ మేరీ కోమ్, ప్రముఖ బాలీవుడ్ నటి రేఖ సహా 12 మంది నామినేటెడ్ రాజ్యసభ సభ్యులుగా ఉన్న విషయం తెలిసిందే. అయితే, వారు సభకు హాజరుకాకపోవడంపై సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ నరేష్ అగర్వాల్ ఈ రోజు రాజ్యసభలో ప్రశ్నించారు. నామినేటెడ్ ఎంపీలు సభకు గైర్హాజరవుతూనే కొనసాగవచ్చా? అని అడిగిన ఆయన.. ఒకవేళ వారికి ఆసక్తి లేకపోతే రాజీనామా చేయకూడదా? అని ప్రశ్నించారు. వారు రాజ్యసభకు రావడం లేదంటే, వారికి ఇక్కడకి రావడానికి ఆసక్తి లేదనే కదా? అన్నారు.
అయితే, ఈ ప్రశ్నకు రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ కురియన్ సమాధానం ఇస్తూ, ఇది పాయింట్ ఆఫ్ ఆర్డర్ కాదని అన్నారు. నామినేటెడ్ ఎంపీలను కొన్ని రోజుల పాటు సభకు హాజరుకావాలని మాత్రం కోరవచ్చని తెలిపారు. కురియన్ చెప్పిన సమాధానానికి స్పందించిన నరేష్ అగర్వాల్ అలా చేయమని సలహా ఇస్తే, తాను నామినేటెడ్ సభ్యులకు లేఖలు రాస్తానని చెప్పారు.