: వచ్చే ఐదేళ్లలో 1000 స్క్రీన్లు...4,500 కోట్ల ఆదాయం లక్ష్యం: పీవీఆర్ మల్టీప్లెక్స్
పీవీఆర్ మల్టీప్లెక్స్ ధియేటర్ల విస్తరణను ఆ సంస్థ లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఇప్పటికే దేశంలోని 50 ప్రధాన నగరాల్లో 570 స్క్రీన్లు కలిగిన పీవీఆర్ సంస్థ వచ్చే ఐదేళ్లలో ఈ సంఖ్యను 1000కి పెంచుకోవాలని లక్ష్యంగా నిర్ణయించుకుంది. అదే సమయంలో తమ వ్యాపారం 3,500 కోట్ల రూపాయల నుంచి 4,500 కోట్ల రూపాయలకు చేరుతుందని పీవీఆర్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ నితిన్ సూద్ తెలిపారు. గతేడాది పీవీఆర్ సంస్థల రాబడి 1,743.98 కోట్ల రూపాయలని ఆయన చెప్పారు. ఈ ఏడాది ఇది 2,100 కోట్లకు చేరుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం తమ ధియేటర్లలో ఏడాదికి 7.5 కోట్ల మంది సినిమాలు చూస్తున్నారని, రాబోయే మూడేళ్లలో తమ లక్ష్యాలను చేరుకుంటే వారి సంఖ్య 10 కోట్లకు చేరుతుందని ఆయన తెలిపారు.