: చంద్రబాబు మాట్లాడే ఇంగ్లిష్ గురించి కేటీఆర్ కూడా కామెంట్ చేశారు!: జగన్
పదవ తరగతి ప్రశ్న పత్రం లీకేజీపై ఆంధ్రప్రదేశ్ అంసెబ్లీలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్‌రెడ్డి ఏనాడైనా పరీక్షలు రాశాడా? ఆయనకు చదువువచ్చా? అంటూ చురకలు అంటించిన విషయం తెలిసిందే. చంద్రబాబు మాటలకు జగన్ కౌంటర్ ఇచ్చారు. తాను ఏ స్కూల్ నుంచి వచ్చానో అందరికీ తెలుసని, చంద్రబాబు నాయుడిలా వచ్చీరానీ ఇంగ్లిష్ నేర్పే స్కూల్ నుంచి రాలేదని అన్నారు. తాను బేగంపేట్ లోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదివానని చెప్పారు. పదవ తరగతిలో ఫస్ట్ క్లాస్‌లో పాసై ఆ తరువాత ఇంటర్, డిగ్రీల్లోనూ ఫస్ట్ క్లాస్‌లోనే పాస్ అయ్యానని చెప్పారు. చంద్రబాబు నాయుడి ఇంగ్లిష్ గురించి బయట అంతా ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలని అన్నారు.
చంద్రబాబు పీహెచ్‌డీ డిస్ కంటిన్యూ చేశారని జగన్ ఎద్దేవా చేశారు. ఎక్కడైనా మాట్లాడాల్సి వస్తే చంద్రబాబు వచ్చీరానీ ఇంగ్లిష్‌లో మాట్లాడతారని అన్నారు. తెలంగాణ మంత్రి కేటీఆర్ కూడా చంద్రబాబు ఇంగ్లిష్ గురించి కామెంట్ చేశారని అన్నారు. ఇంత దారుణమైన ఇంగ్లిష్ మాట్లాడుతారని కేటీఆర్ కూడా గతంలో అన్నారని జగన్ వ్యాఖ్యానించారు.