: సుప్రీంకోర్టు తీర్పుతో మోటారు సైకిళ్ల ధరలపై భారీ తగ్గింపు... ఇవాళ, రేపటి వరకే చాన్స్
బీఎస్ -3 కాలుష్య ప్రమాణాల వాహనాలను ఏప్రిల్ 1 నుంచి నిషేధిస్తూ సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాలు... కొత్తగా బైక్ కొనుగోలు చేయాలనుకుంటున్న వారిపై పన్నీరు చల్లినట్టయింది. బీఎస్ - 3 ప్రమాణాల ద్విచక్ర వాహనాలు సుమారు 6.71 లక్షల వరకు కంపెనీలు, డీలర్ల వద్ద ఉన్నట్టు అంచనా. గడువు ఇవాళ, రేపే. ఆ తర్వాత వాటిని విక్రయించడానికి అనుమతి లేదు. దీంతో ఉన్న వాహనాలను త్వరత్వరగా విక్రయించుకునేందుకు కంపెనీలు భారీ తగ్గింపులకు తెర తీశాయి.
హీరో మోటోకార్ప్, హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా రూ.12,500 వరకు తగ్గింపును ప్రకటించాయి. హీరో మోటో కార్ప్ స్కూటర్లపై 12,500, ప్రీమియం బైక్ లపై రూ.7,500, ప్రారంభస్థాయి బైక్ లపై రూ.5,000 తగ్గింపును ఇస్తున్నట్టు డీలర్లు వెల్లడించారు. హోండా కంపెనీ బీఎస్ - 3 స్కూటర్లు, మోటార్ సైకిళ్లపై ఏకంగా రూ.10,000 తగ్గింపును ఇస్తోంది. రేపటి వరకు ఈ ఆఫర్లు అమల్లో ఉంటాయి. ఒకవేళ ఈ లోపే స్టాక్స్ అయిపోతే ఆఫర్ ముగిసినట్టేనని కంపెనీలు స్పష్టం చేశాయి.