: నారాయణ, చైతన్య కావచ్చు, జగన్ స్కూళ్లు కావచ్చు.. తప్పు చేస్తే చర్యలు తప్పవు: చంద్రబాబు
పదవ తరగతి పరీక్ష ప్రశ్న పత్రం లీకైన విషయంపై ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో చర్చ కొనసాగుతోంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. ప్రతిపక్ష వైఎస్సార్ సీపీ సభ్యులు చేస్తోన్న ఆరోపణలపై మండిపడ్డారు. విషయాన్ని అర్థం చేసుకొని మాట్లాడితే ప్రజల్లో గుర్తింపు వస్తుంది తప్పా తప్పుడు ఆరోపణలు చేస్తే రాదని అన్నారు. ఈ చర్యకు పాల్పడిన వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోలేదని అవాస్తవాలు చెప్పే ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు.
నారాయణ, చైతన్య స్కూళ్లు కావచ్చు, జగన్ స్కూళ్లు కావచ్చు.. తప్పు చేస్తే ఏ విద్యాసంస్థలపై అయినా చర్యలు తప్పవని చంద్రబాబు అన్నారు. తమకు ఎవరినీ కాపాడాల్సిన అవసరం లేదని అన్నారు. వైసీపీ సభ్యులు వాస్తవాలు దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలని ఆయన అన్నారు. ఈ నెల 25న ఈ ఘటన జరిగితే డీఈవో ప్రభుత్వానికి 26నే నివేదిక పంపారని అన్నారు. ప్రశ్నపత్రం బయటకు వచ్చిన వెంటనే అధికారులంతా వేగంగా స్పందించారని చెప్పారు.