: గడ్డాలు... ముసుగులతో కనిపించొద్దు...: ప్రజలపై చైనా ఆంక్షలు
సొంత ప్రజలపైనే చైనా మరోసారి కఠిన ఆంక్షలకు దిగింది. పశ్చిమ ప్రాంతమైన జింజియాంగ్ లో మత వేర్పాటు వాదం ప్రబలి పోకుండా ఉక్కుపాదం మోపే చర్యలు ప్రారంభించింది. ఇందులో భాగంగా గుబురు గడ్డాలతో కనిపించరాదని ఆదేశించింది. బహిరంగ ప్రదేశాల్లో ముఖానికి ముసుగులు ధరించరాదని, ప్రభుత్వ టెలివిజన్ చూడ్డానికి, ప్రభుత్వ రేడియో కార్యక్రమాలు వినడానికి, ప్రభుత్వ సేవలు పొందడానికి నిరాకరిస్తే సహించేది లేదని కఠిన హెచ్చరికలు జారీ చేసింది.
వేర్పాటు వాదానికి వ్యతిరేకంగా పిల్లల్ని నైతిక ప్రవర్తనతో పెంచడం తల్లిదండ్రులపై ఉన్న బాధ్యతని గుర్తు చేసింది. ఈ మేరకు రూపొందించిన ఓ చట్టాన్ని జింజింయాగ్ చట్ట సభ సభ్యులు ఆమోదించారు. ముస్లిం యూఘర్ తెగ వారికి కేంద్రంగా ఉన్న ఇక్కడ మత ఘర్షణల కారణంగా ఇటీవలి కాలంలో వందల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. ఇస్లామిక్ మిలిటెంట్, వేర్పాటు వాదుల చర్యలతో ఈ ప్రాంతంలో శాంతి కరవైంది. ఈ నేపథ్యంలో తాజా ఆంక్షలను తీసుకొచ్చినట్టు తెలుస్తోంది.