: ఇదేమి విడ్డూరమో... పరీక్షల్లో విద్యార్థులకంటే టీచర్లపైనే ఎక్కువ కేసులు!
పరీక్షల్లో కాపీ కొడుతూ విద్యార్థులు పట్టుబడడం సాధారణంగా చోటుచేసుకునే వ్యవహారమే. కానీ, ఇక్కడ టీచర్లు సైతం తామేమీ తక్కువ తినలేదన్నట్టు వ్యవహరిస్తున్నారు. అదెక్కడో కాదు నేరాల్లో పేరు మార్మోగిపోయే ఉత్తరప్రదేశ్ రాష్ట్రమే. ఇక్కడ జరుగుతున్న బోర్డు పరీక్షల్లో తనిఖీల్లో భాగంగా ఇప్పటి వరకు 111 సూపరింటెండెంట్లు, 178 మంది ఇన్విజిలేటర్లు మోసాలకు పాల్పడుతూ పట్టుబడ్డారు. వీరందరిపై కేసులు నమోదయ్యాయి. దీంతో ఏం చేయాలో తోచక బోర్డు అధికారులు తలపట్టుకుంటున్నారు.
అదే సమయంలో కాపీలు కొడుతూ 1,400 మంది విద్యార్థులు పట్టుబడగా వారిపై నమోదైన కేసులు 70 మాత్రమే. భారీ అక్రమాల నేపథ్యంలో యూపీ బోర్డు ఇప్పటికే 54 కేంద్రాల్లో పరీక్షలను రద్దు చేసింది. 57 సెంటర్లను రద్దు చేసింది. 327 మంది పరీక్షా కేంద్రాల సూపరింటెండెంట్ లను మార్చినట్టు యూపీ మాధ్యమిక శిక్షా పరిషత్ డైరెక్టర్ ఏవీ వర్మ తెలిపారు.