: ప‌్రపంచ కుబేరుల జాబితాలో రెండో స్థానంలో నిలిచిన అమెజాన్ సీఈవో!
ప‌్రపంచ కుబేరుల జాబితాలో అమెజాన్ సీఈవో జెఫ్రీ ప్రెస్టన్ బెజోస్ (53) మున్ముందుకు దూసుకెళ్లారు. తమ కంపెనీ షేరు రికార్డ్ స్థాయిలో లాభాలు అందుకోవడంతో జెఫ్రీ ప్రెస్టన్ బెజోస్... బ్లూమ్ బర్గ్ బిలయనీర్స్ ఇండెక్స్ జాబితాలో ఏకంగా రెండో స్థానానికి చేరుకున్నారు. దుబాయ్ ఆధారిత రీటైలర్ సాక్.కాంను కొనుగోలు చేయాలని అమెజాన్ భావిస్తున్నట్లు ప్రకటించిన వెంటనే ఆ కంపెనీ షేర్ ఒక్కసారిగా పైకి ఎగిసింది. నిన్న ట్రేడింగ్‌లో ఆ కంపెనీ మార్కెట్ విలువ 18.32 బిలియన్ డాలర్లు పెరిగింది.
మరోవైపు బ్రెజోస్ ఆదాయంలో మరో 1.5 బిలియన్ డాలర్లు జత చేరడంతో.. బెజోస్ నికర ఆదాయం 75.6 బిలియన్ డాలర్లకు చేరింది. ఈ ఏడాది జెఫ్రీ ప్రెస్టన్ బెజోస్ దాదాపు 10.2 బిలియన్ డాలర్లను ఆర్జించారు. ఈ జాబితాలో 86 బిలియన్ల డాలర్లతో ప్రపంచంలో అత్యంత ధనవంతుడిగా మైక్రోసాఫ్ట్ కో ఫౌండర్ బిల్‌గేట్స్ ఉన్నారు. అయితే ఆయన కంటే బెజోస్ కేవలం 10.4 బిలియన్ల దూరంలో నిలిచారు.