: విజయవాడకు పవన్ కల్యాణ్.. మరోసారి ప్రశ్నించనున్న జనసేనాధినేత!
అగ్రీగోల్డ్ బాధితులను పరామర్శించి, వారికి అండగా నిలుస్తానన్న భరోసాను ఇచ్చేందుకు జన సేన అధినేత పవన్ కల్యాణ్ ఈ ఉదయం విజయవాడకు చేరుకున్నారు. గన్నవరం ఎయిర్ పోర్టుకు వచ్చిన ఆయనకు, జనసేన కార్యకర్తలు ఘన స్వాగతం పలుకగా, అక్కడి నుంచి విజయవాడకు ఆయన బయలుదేరారు. మరికాసేపట్లో తుమ్మలపల్లి కళాక్షేత్రంలో అగ్రీగోల్డ్ బాధితులతో ఆయన సమావేశం అవుతారు. ఆపై వారిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు.
ఈ సందర్భంగా బాధితులకు చెల్లించాల్సిన డబ్బులను ఎప్పుడు ఇస్తారో చెప్పాలని పవన్ ప్రశ్నించనున్నారు. పవన్ రంగంలోకి దిగడంతో తమకు సత్వర న్యాయం జరుగుతుందని బాధితులు భావిస్తున్నారు. కాగా, ఈ సభకు ఎంపిక చేసిన 650 మంది బాధితులను మాత్రమే అనుమతించనున్నామని జనసేన వర్గాలు వెల్లడించాయి.