: నమాజ్, సూర్య నమస్కారాలు.. రెండూ ఒకటే!: యోగి ఆదిత్యనాథ్
ముస్లింలు ఆచరించే నమాజ్, హిందువులు చేసే సూర్యనమస్కారాలు రెండింటికీ చాలా దగ్గర పోలికలు ఉన్నాయని, రెండూ ఒకటేనని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అభిప్రాయపడ్డారు. సూర్యనమస్కారాల్లో భాగంగా వేసే ఆసనాలు, ముద్రలు, ప్రాణాయామ క్రియలు.. నమాజ్ సమయంలో ముస్లింలు చేసినట్టుగానే ఉంటాయని పేర్కొన్నారు. తద్వారా యోగాకు, హిందూమతానికి సంబంధం లేదని చెప్పే ప్రయత్నం చేశారు.
లక్నోలో నిర్వహించిన ఓ యోగా కార్యక్రమానికి హాజరైన యోగి ఈ విధంగా వ్యాఖ్యానించారు. అధికారంలో ఉన్నవాళ్లు భోగాల కోసం అలమటించారే తప్ప యోగా గురించి ఆలోచించలేదని విమర్శించారు. కులమతాల పేరుతో దేశాన్ని విడగొట్టాలని భావిస్తున్న వారికి యోగా గురించి పట్టదన్నారు. 2014కు ముందు యోగా గురించి మాట్లాడిన వారికి మతం రంగు పులిమేవారని అన్నారు. ప్రధాని నరేంద్రమోదీ యోగాను అంతర్జాతీయం చేసేందుకు కృషి చేస్తున్నందుకు యోగి ప్రశంసించారు. కార్యక్రమంలో ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్ పాల్గొన్నారు.