: ఉచిత సేవలు ముగుస్తున్న వేళ.. మరో మైలురాయిని చేరుకున్న ‘జియో’
రేపటి (మార్చి 31)తో ఉచిత సేవలు ముగుస్తున్న వేళ రిలయన్స్ జియో మరో మైలురాయిని చేరుకుంది. జియోకు ప్రస్తుతం 10 కోట్ల మంది వినియోగదారులు ఉండగా ఇప్పటి వరకు 5 కోట్ల మంది వినియోగదారులు ‘ప్రైమ్’ క్లబ్‌లో చేరినట్టు సంస్థ ప్రకటించింది. ఈనెల 31తో ‘హ్యాపీ న్యూ ఇయర్’ ఆఫర్ ముగుస్తుండడంతో రూ. 99 చెల్లించి జియో ప్రైమ్ మెంబర్లుగా మారాలని ఇదివరకే సూచించింది. తద్వారా ఏడాదిపాటు ‘హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్’ను పొందే వీలుంటుందని పేర్కొంది.
ప్రస్తుతం జియోకు 10-11 కోట్ల మంది వినియోగదారులు ఉన్నారు. వీరిలో 30 శాతం మంది కేవలం డేటా వినియోగానికి మాత్రమే జియోను తీసుకున్నట్టు అంచనా. దీంతో మిగిలిన ఏడుకోట్ల మంది వినియోగదారులను చెల్లింపు వినియోగదారులుగా మార్చుకోవాలని భావిస్తోంది. ఈ క్రమంలో ఇప్పటి వరకు ఐదు కోట్ల మంది ప్రైమ్ మెంబర్లుగా చేరారు. దీంతో ఐదు కోట్ల మంది వినియోగదారులతో రిలయన్స్ జియో దేశంలో అతిపెద్ద బ్రాడ్‌బ్యాండ్ సేవలు అందిస్తున్న సంస్థగా అవతరించనుంది. ఇప్పటి వరకు ఈ స్థానాన్ని భారతీ ఎయిర్‌టెల్ ఆక్రమించింది. గత డిసెంబరు నాటికి ఆ సంస్థకు 3.7 కోట్ల మంది వినియోగదారులున్నారు. డిసెంబరుకు మూడు నెలల ముందు ఎయిర్‌టెల్‌కు 4.1 కోట్లమంది ఖాతాదారులు ఉండడం గమనార్హం.