: శభాష్... అతనికి డబుల్ బెడ్ రూం ఇవ్వండి!: కేటీఆర్ ఆదేశం
సూర్యాపేట మండలం కాసరాబాద్ గ్రామంలోని జమునానగర్ కు చెందిన అశోక్ అనే కూలీ పూరిపాకలో నివసిస్తున్నాడు. పూరిపాకలో ఉన్నప్పటికీ అశోక్ ప్రభుత్వం మంజూరు చేసిన నిధులతో మరుగుదొడ్డిని పక్కాగా నిర్మించుకున్నాడు. తమకున్న కొద్దిపాటి స్థలంలో పాక వేసుకొని ఉంటున్న ఆ కుటుంబం స్వచ్ఛభారత్ స్ఫూర్తిగా మరుగుదొడ్డి నిర్మించుకుని పలువురికి ఆదర్శంగా నిలిచింది. దీంతో వారిపై మీడియాలో 'పాకలో ఉన్నా పక్కా మరుగుదొడ్డి' అంటూ కథనాలు ప్రసారమయ్యాయి. వీటిని చూసిన మంత్రి కేటీఆర్ వారిని అభినందించారు. వెంటనే కలెక్టర్ సురేంద్ర మోహన్ కు ఫోన్ చేసి, వారికి డబుల్ బెడ్ రూం నివాసం కట్టించి ఇవ్వాలని సూచించారు. దీంతో కలెక్టర్ వారున్న స్థలానికి వెళ్లి, పరిశీలించి, వారికి డబుల్ బెడ్ రూం ఇల్లు కట్టిస్తామని హామీ ఇచ్చారు.