: కొత్త 'ఫిల్మ్ ఛాంబర్' పేరుతో మోసం చేస్తున్నాడంటూ సినీ నటి కవిత ఫిర్యాదు
తన పరువు ప్రతిష్టలకు భంగం కలిగిస్తున్నాడంటూ నవ్యాంధ్రప్రదేశ్ చలన చిత్ర వాణిజ్య మండలి (ఫిలించాంబర్) అధ్యక్షుడు ఎస్.వీ.ఎన్.రావుపై సీనియర్ సినీ నటి, టీడీపీ నేత కవిత హైదరాబాదులోని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ కేసు వివరాల్లోకి వెళ్తే... గతంలో ప్రొడక్షన్ మేనేజర్ గా పని చేసిన ఎస్.వీ.ఎన్.రావు రాష్ట్ర విభజన అనంతరం బంజారా హిల్స్ రోడ్ నెం. 2లోని నవోదయ కాలనీలో నవ్యాంధ్రప్రదేశ్ ఫిలించాంబర్ పేరిట కార్యాలయం తెరిచాడు. దానికి తానే అధ్యక్షుడిగా పేర్కొన్నారు. కవితను అడగకుండానే ఆమెను వైస్ ప్రెసిడెంట్ గా నియమించాడు. వారితో పాటు పలువురు నిర్మాతలు, దర్శకులు, ఔత్సాహికులను సభ్యులుగా చేర్చుకున్నాడు.
ఇందులో సభ్యత్వం పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నాడు. ఈ విషయం తెలిసిన తరువాత దీనిపై ఆరాతీయగా, దానికి, ఫిల్మ్ ఛాంబర్ కు ఎలాంటి సంబంధం లేదని, దానికి ఎలాంటి హక్కులు లేవని తెలియడంతో అతను బలవంతంగా కట్టబెట్టిన పదవి నుంచి నిష్క్రమించానని ఆమె చెప్పారు. అయితే ఆమె రాజీనామాను తిరస్కరించానని, దానిని ఉపసంహరించుకోవాలని ఒత్తిడి తెస్తూ.. సీఎం చంద్రబాబు, కేంద్రమంతులు వెంకయ్యనాయుడు, బండారు దత్తాత్రేయతో తన పరిచయాన్ని ఉపయోగించి ఫిల్మ్ ఛాంబర్ హక్కులు కల్పించాలని డిమాండ్ చేస్తున్నాడని, అతని డిమాండును తాను పట్టించుకోలేదని, దాంతో గత మూడు రోజులుగా ఫేస్ బుక్ లో తనపై దుష్ప్రచారం చేస్తున్నాడని ఆమె చెప్పారు.
తాను కారు డిమాండ్ చేశానని ప్రచారం చేస్తున్నాడని, తన పరువుకు నష్టం కలిగించారని ఆమె మండిపడ్డారు. గుంటూరులో నేడు నవ్యాంధ్రప్రదేశ్ ఫిలించాంబర్ కార్యాలయాన్ని తెరవబోతున్నాడని, సంస్థకు సీఎం ఆశీస్సులు ఉన్నాయని నమ్మిస్తూ పలువురి నుంచి డబ్బులు వసూలు చేస్తున్నాడని ఆమె తెలిపారు. అతనిపై చర్యలు తీసుకోవాలని ఆమె ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని వెల్లడించారు.