: 'వీలైనంత త్వరగా ఇన్నింగ్స్ ముగించేద్దాం' అన్నాడు... అందుకే బాదేశాడు: రహానే స్పీడుపై కేఎల్ రాహుల్
ధర్మశాల వేదికగా జరిగిన నాలుగో టెస్టులో టీమిండియా కెప్టెన్ అజింక్యా రహానే ఆసీస్ బౌలర్లపై విరుచుకుపడి వన్డే తరహాలో వేగంగా పరుగులు చేసిన సంగతి తెలిసిందే. తన శైలికి విభిన్నంగా రహానే ఎందుకు ఆడాడు? అన్న దానిపై రాహుల్ వివరణ ఇచ్చాడు. రెండో ఇన్నింగ్స్ లో 106 పరుగుల లక్ష్యం నిర్దేశించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో 19 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ ఆరంభంలోనే మురళీ విజయ్ (8) వికెట్ కోల్పోయింది.
అనంతరం పుజారా (0) రనౌట్ అయ్యాడు. దీంతో రహనే వస్తూనే కుమ్మిన్స్ బౌలింగ్ లో భారీ సిక్సర్లు బాదాడు. అనంతరం తనతో మాట్లాడుతూ, 'వీలైనంత త్వరగా ఇన్నింగ్స్ ముగించేద్దాం' అని అన్నాడని రాహుల్ చెప్పాడు. చెప్పినట్టే ధాటిగా ఆడాడని రాహుల్ తెలిపాడు. కాగా, రాహుల్ 76 బంతుల్లో 9 ఫోర్ల సాయంతో 51 పరుగులు చేయగా, రహానే కేవలం 27 బంతుల్లో 4 ఫోర్లు 2 సిక్సర్లతో 38 పరుగులు చేశాడు. దీంతో వన్డే తరహాలో టీమిండియా కేవలం 23.5 ఓవర్లలో 106 పరుగులు చేసి విజయం సాధించింది.