: ‘బెయిల్ రద్దు పిటిషన్’ వార్త వినే జగన్ సభనుంచి బయటకు వెళ్లిపోయారా?: ధూళిపాళ్ల చురకలు
ఆదాయానికి మించి ఆస్తులు కలిగిన కేసులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి ఇచ్చిన బెయిల్ ను రద్దు చేయాలని సీబీఐ కోర్టులో సీబీఐ అధికారులు ఈ రోజు పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర వైసీపీ సభ్యులకు చురకలంటించారు. ఈ రోజు సభ నుంచి జగన్ సహా వైసీపీ సభ్యులు ఉన్నట్టుండి గొడవ చేస్తూ ఎందుకు వెళ్లిపోయారన్న విషయం తనకు మొదట అర్థం కాలేదని, వారు వాకౌట్ అని కూడా చెప్పకుండా వెళ్లిపోయారని అన్నారు.
అయితే, వారు ఎందుకు వెళ్లిపోయారో తనకు ఇప్పుడు తెలిసిందని, జగన్‌కి ఇచ్చిన బెయిల్ ను రద్దు చేయాలని సీబీఐ కోర్టులో సీబీఐ అధికారులు పిటిషన్ వేయడంతోనే, ఆ వార్త తెలుసుకొని జగన్ ఆందోళనగా వెళ్లిపోయారని ఎద్దేవా చేశారు. రకరకాల కారణాలతో జగన్ అక్రమాస్తుల కేసులో ఇప్పటికే ఎంతో జాప్యం జరిగిందని, ఇప్పటికయినా వేగంగా ముందుకు వెళ్లాలని ఆయన అన్నారు.