: ఎగతాళి చేసినా, రెచ్చగొట్టినా.. తిప్పి కొడతాం: విరాట్ కోహ్లీ
ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఇక ఏమాత్రం తన స్నేహితులు కారని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నాడు. ఈ రోజు ఆస్ట్రేలియాపై టెస్టు సిరీస్ గెలిచిన టీమిండియా కప్పు కొట్టేసిన విషయం తెలిసిందే. అనంతరం కోహ్లీ మీడియాతో మాట్లాడుతూ... తాను ‘సిరీస్‌కు ముందు స్మిత్ అండ్ టీమ్.. ఫీల్డ్ బయట ఫ్రెండ్సే’ అని అన్న విషయాన్ని ప్రస్తావిస్తూ.. ఫీల్డ్‌లో ఉద్రిక్త స్థితులు సహజమే అనుకున్నాను కానీ ఆ సమయంలో చెప్పింది తప్పని గ్రహించానని అన్నాడు. ఆస్ట్రేలియా ఆటగాళ్లు, మీడియా ఏమనుకున్నా తాను పట్టించుకోనని స్పష్టం చేశాడు.
బెంగళూరు టెస్టులో డీఆర్ఎస్ కోసం స్మిత్ డ్రెస్సింగ్ రూమ్ వైపు చూసిన అంశంపై విరాట్ కోహ్లీ అభ్యంతరాలు వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అనంతరం కూడా ఆస్ట్రేలియా ఆటగాళ్ల తీరు, ఆ దేశ మీడియా ప్రచురించిన కథనాలతో కోహ్లీ విసుగెత్తిపోయాడు. తమను ఎవరైనా ఎగతాళి చేసినా, రెచ్చగొట్టినా తమ మాటతోనూ, ఆటతోనూ వెంటనే తిప్పి కొడతామని కోహ్లీ చెప్పాడు. ఆసీస్ మీడియాపై మాట్లాడుతూ కొందరు ఇంట్లో కూర్చొని అసత్య కథనాలను రాస్తుంటారని అన్నాడు.