: 22 ఏళ్లుగా నల్లా కనెక్షనే తీసుకోలేదు.. అయినా ఆ ఇంట్లో పుష్కలంగా నీరు!


బెంగళూరులో నివసిస్తున్న ఓ వ్యక్తి ఇంటికి నల్లా కనెక్ష‌న్ లేదు. అయిన‌ప్ప‌టికీ ఆయ‌నకి ప్ర‌తిరోజూ మంచినీళ్లు ల‌భిస్తున్నాయి. స్నానానికి, ఇంటి అవ‌స‌రాల‌కు పుష్క‌లంగా నీరు ల‌భిస్తోంది. ఆ బెంగ‌ళూరు వ్య‌క్తి త‌న ఆద‌ర్శ‌వంత‌మైన ప‌నితో అంద‌రికీ స్ఫూర్తిగా నిలుస్తున్నాడు. ఆయన చేస్తోన్న‌ ప‌నులను అంద‌రూ పాటిస్తే గ‌నుక‌ నీటి కోసం యుద్ధాలు చేయ‌వ‌ల‌సి వ‌స్తుంద‌న్న మాట‌లు ఇక విన‌ప‌డ‌కుండా పోతాయి. న‌గ‌రంలోని ఏఆర్‌ శివకుమార్‌ అనే సీనియర్‌ శాస్త్రవేత్త తన ఇంట్లో నల్లా కనెక్షన్‌ లేకుండా కేవలం వర్షపు నీటిని ఒడిసిపట్టి 22 ఏళ్లుగా త‌న‌ అవసరాలు తీర్చుకుంటున్నారు.

ఆయ‌న‌ కర్ణాటక స్టేట్‌ కౌన్సిల్‌ ఫర్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీలో సీనియర్‌ శాస్త్రవేత్తగా విధులు నిర్వ‌ర్తిస్తున్నారు. తన ఇంటిని గ్రీన్‌ హౌస్‌గా మార్చి వర్షపు నీటిని ఒడిసిపట్టి నిల్వ చేసే ఏర్పాట్లు చేయ‌డంతో వర్షాకాలంలో రోజుకు దాదాపు 400 లీటర్ల నీరు నిల్వ చేయగలుగుతున్నారు. త‌మ ఇంట్లో ఏడాదికి 2.3 లక్షల లీటర్ల నీటిని సేకరించవచ్చని ఆయన తెలిపారు. త‌మ అవ‌స‌రాల‌కు పోనూ ఎంతో నీరు మిగిలిపోతుంద‌ని ఆయ‌న చెప్పారు. ఆయన ఇంట్లో 45వేల లీటర్ల వరకు నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యం ఉంది. వర్షాలు ప‌డని రోజులకు కూడా నీరు ముందుగానే నిల్వ చేసుకుంటారు. ఇంట్లో అన్ని అవ‌స‌రాల‌కు వాటినే వాడ‌తారు. ప్ర‌తిరోజు 400 లీటర్ల చొప్పున వాడినా వంద రోజులకు 40 వేల లీటర్లు సరిపోతాయని, మిగతా నీరంతా నిల్వ ఉంటుందని, తనకు 22 ఏళ్లుగా న‌ల్ల బిల్లు క‌ట్టే అవ‌స‌రం రాలేద‌ని శివ‌కుమార్ పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News