: 'యోగి ఆదిత్యనాథ్ జిందాబాద్' అన్న యువకుడిని కాల్చి చంపిన సమాజ్ వాదీ నేత
యూపీ కొత్త సీఎం యోగి ఆదిత్యనాథ్ వర్థిలాల్లి అని నినదించిన ఓ యువకుడిని, సమాజ్ వాదీ నేత ఒకరు తుపాకితో కాల్చి చంపిన ఘటన యూపీలో సంచలనం సృష్టించింది. అస్మోలీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. మధాన్ అనే గ్రామంలో స్థానిక బీజేపీ నేత మోనూ సింగ్ చిన్న తమ్ముడు వినికేత్ అలియాస్ నన్హే (17) 'యోగి జిందాబాద్' అని నినాదాలు చేశాడు. ఆ సమయంలో అదే దారిలో వెళుతున్న జిల్లా పరిషత్ సభ్యురాలు ఉషారాణి భర్త, సమాజ్ పార్టీ లోకల్ లీడర్ శిశుపాల్ సింగ్, తన తుపాకితో నన్హేను కాల్చి చంపాడు. ఆపై శిశుపాల్ అనుచరులు బాధితుల ఇంటిపై దాడి చేసి రాళ్లు విసరగా, ముగ్గురికి గాయాలయ్యాయి. వాస్తవానికి నన్హే మరో సోదరుడు మోనూను హత్య చేసేందుకు శిశుపాల్ వచ్చాడని పోలీసులు వ్యాఖ్యానించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించామని, విచారణ జరుపుతున్నామని, నిందితుడు పరారీలో ఉండగా, అతన్ని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని వెల్లడించారు.