: 13 ఏళ్ల బాలికపై ఎనిమిది మంది టీచర్ల అత్యాచారం ఉదంతం... అంతా అబద్ధమని తేల్చిన రాజస్థాన్ ప్రభుత్వం!
రెండు రోజుల క్రితం వెలుగులోకి వచ్చి.. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన రాజస్థాన్ విద్యార్థిని అత్యాచారం కేసు తప్పుడుదని ఆ రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి అనితా బడేల్ ప్రకటించారు. తన 13 సంవత్సరాల కుమార్తెపై ఎనిమిది మంది ఉపాధ్యాయులు ఏడాదిన్నరగా అత్యాచారం చేశారని ఓ వ్యక్తి ఫిర్యాదు చేయగా, అది ప్రభుత్వంపై తీవ్ర విమర్శలకు కారణమైన సంగతి తెలిసిందే.
ఇక నిజాన్ని వెలికితీయాలని, నిందితులను కఠినంగా శిక్షించాలని స్వయంగా సీఎం వసుంధరా రాజే సైతం ఆదేశించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు విచారించారు. అసలు ఆ బాలిక నాలుగేళ్ల నుంచి స్కూలుకే వెళ్లడం లేదని, ఆమెపై టీచర్ల లైంగికదాడి అవాస్తవమని తేల్చారు. గతంలో పాఠశాల యాజమాన్యం బాలిక తండ్రిపై కేసు పెట్టగా, దానికి ప్రతీకారంగా ఈ అసత్య ఆరోపణలు చేశాడని, టీచర్లపై నమోదైన కేసును తొలగిస్తామని అన్నారు. తనది తప్పుడు ఫిర్యాదేనని బాలిక తండ్రి కూడా అంగీకరించాడని, అతనిపై కేసు నమోదు చేస్తామని తెలిపారు.