: ప్రపంచంతో కన్నీళ్లు పెట్టిస్తున్న పసివాడి చివరి కోరిక!


సాధారణంగా పిల్లలు అది కావాలి .. ఇది కావాలి అని కోరుతూ వుంటారు. అయితే, ఈ బాలుడు మాత్రం అమ్మ పక్కన తనకు 'శాశ్వత నిద్ర'ను ప్రసాదించమని కోరిక కోరాడు. కేన్సర్‌కు చికిత్స పొందుతూ లండన్‌లోని ఓ ఆస్పత్రిలో మృతి చెందిన ఏడేళ్ల బాలుడి ఈ చివరి కోరిక విని ప్రపంచం కన్నీళ్లు పెట్టుకుంటోంది. శుక్రవారం మృతి చెందిన ఫిలిప్ క్వాస్ని తనను తన తల్లి సమాధి పక్కనే పూడ్చి పెట్టాలని, అలా చేస్తే స్వర్గంలో ఉన్న అమ్మ తనను బాగా చూసుకుంటుందని చెప్పడంతో అక్కడున్నవారి హృదయాలు ద్రవించాయి. అప్రయత్నంగా కళ్లు వర్షించాయి. బాలుడి చివరి కోరిక గురించి తెలిసిన ప్రపంచం సైతం కన్నీళ్లు పెట్టుకుంది. బాలుడి చివరి కోరిక తీర్చేందుకు ముందుకొచ్చింది. 2011తో ఫిలిప్ తల్లి  ఎజ్నియెస్కా కూడా కేన్సర్‌తోనే మృతి చెందారు. తండ్రి పీటర్‌తో కలిసి ఉంటున్న ఫిలిప్‌కు కేన్సర్ సోకినట్టు గతేడాది సెప్టెంబరులో గుర్తించారు. బాలుడికి సోకిన జువెనైల్‌ మైలోమోనోసైటిక్‌ ల్యుకేమియా(జేఎంఎంఎల్‌) నుంచి రక్షించేందుకు వైద్యులు విశ్వప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. కీమోథెరపీ, స్టెమ్‌సెల్‌ థెరపీలు కూడా ప్రభావం చూపలేకపోయాయి.

కాగా, ఫిలిప్ చివరి కోరిక గురించి తెలియడంతో దాతలు  పెద్ద సంఖ్యలో ముందుకొచ్చారు. బాలుడి కోరిక తీర్చేందుకు 6500 పౌండ్లు అవుతుందని భావించగా ఆన్‌లైన్‌ ఫండ్‌రైజింగ్‌ సైట్‌ 'జస్ట్‌గివింగ్‌' ద్వారా 41,000 పౌండ్లు విరాళంగా సమకూరాయి. ఈ సొమ్మును ఫిలిప్ కుటుంబ సభ్యులకు అందించారు. చనిపోతానని ఫిలిప్‌కు ముందే తెలుసని, తన చేతుల ద్వారా కుమారుడిని పూడ్చి పెట్టాల్సి వస్తుందని ఊహించలేకపోయానని పీటర్ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఫిలిప్ చివరి కోరిక తీర్చేందుకు ముందుకొచ్చిన ప్రతి ఒక్కరికి ఆయన  కృతజ్ఞతలు తెలిపారు. త్వరలోనే కుమారుడి చివరి కోరికను తీరుస్తానని ఆయన పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News