: రోజుకో మలుపు తిరుగుతున్న దుప్పుల వేట కేసు.. ఒంగోలులో నిందితులు!
తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ అడవుల్లో దుప్పులను వేటాడిన కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసులో ఇప్పటికే ముగ్గురు నిందితులు లొంగిపోగా మరో ఆరుగురు పరారీలో ఉన్నారు. ఈ కేసులో ప్రధాన నిందితులు ఆంధ్రప్రదేశ్‌లోని ఓ భూస్వామి ఇంటిలో ఆశ్రయం పొందుతున్నట్టు సమాచారం. ఈ కేసులో మొత్తం 9 మందిపై పోలీసులు అభియోగాలు నమోదు చేశారు.
కీలక నిందితుడు (ఎ4) అక్బర్‌ఖాన్ పరారీలో ఉన్నాడు. ఘటన తర్వాత అక్బర్‌ఖాన్ ఐదు రోజుల పాటు మహదేవపూర్‌లోనే ఉన్నాడు. ఈ కేసుపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించి విచారణను వేగవంతం చేయడంతో గత శుక్రవారం రాత్రి నలువాల సత్యనారాయణ, అస్రార్‌ఖాన్, ఖలీముల్లా ఖాన్‌లు లొంగిపోయారు. ఆ తర్వాత నుంచి అక్బర్‌ఖాన్ కనిపించకుండా పోయాడు. ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితులు ఒంగోలులోని ఓ భూస్వామి వద్ద తలదాచుకున్నట్టు విశ్వసనీయ సమాచారం.
నిందితులను పట్టుకునేందుకు పోలీసు అధికారులు మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. హైదరాబాద్‌లో ఫజల్ మహ్మద్ ఖాన్ కోసం ఓ బృందం గాలిస్తుండగా, గోదావరిఖని, సెంటినరీ కాలనీకి చెందిన నిందితుల కోసం మరో బృందం రంగంలోకి దిగింది. ఇంకో బృందం మున్నా కోసం గాలిస్తోంది. ఏ1 నిందితుడు సత్యనారాయణతోపాటు అతని బంధువు కూడా దుప్పుల వేటలో పాల్గొన్నట్టు పోలీసులు రికార్డుల్లో పేర్కొన్నారు.