: సోదరా జగన్!... నువ్వు మారకపోతే.. లోకేష్ అధికారంలోకి వస్తాడు!: రాయపాటి
వైఎస్సార్సీపీ అధినేత జగన్ కు టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివరావు పలు సూచనలు చేశారు. గుంటూరులో ఆయన మాట్లాడుతూ, 'సోదరా జగన్!...నువ్వు మారాల్సిన సమయం వచ్చింది' అన్నారు. 'ప్రభుత్వం చేసిన మంచి పనులను పొగుడు, చెడును విమర్శించు... అంతే కానీ ప్రభుత్వం ఏం చేసినా విమర్శించకు' అంటూ ఆయన సూచించారు. నీ సభలకు వచ్చే జనాలంతా నీపై అభిమానంతో రావడం లేదని గుర్తించు అని ఆయన చెప్పారు. మీనాన్న మీదున్న ప్రేమతోనే వారంతా నీ దగ్గరకి వస్తున్నారని, మళ్లీ ఓట్లేసే సమయానికి తమకు ఎవరు మంచి చేస్తే వారినే వారు ఎన్నుకుంటారన్న సంగతి నువ్వు గుర్తించాలని ఆయన హెచ్చరించారు. అందుకే విమర్శించాల్సిన సమయంలో విమర్శించినా, ప్రభుత్వ కార్యక్రమాలకు మద్దతు తెలపాలని ఆయన సూచించారు. లేని పక్షంలో నువ్వు అధికారంలోకి రావాలన్న కోరిక కోరికగానే మిగిలిపోతుందని ఆయన చెప్పారు. నీ స్థానంలో లోకేష్ ముఖ్యమంత్రి అవుతారని ఆయన తెలిపారు.