: ఏపీ అసెంబ్లీ లాబీల్లో యువకుడు... ఎమ్మెల్యేను నిలదీసిన వైనం
అమరావతిలోని ఏపీ అసెంబ్లీ లాబీల్లో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. అసెంబ్లీ లాబీల్లోకి ఎలాంటి అనుమతి లేని ఓ యువకుడు చొచ్చుకొచ్చి, తమ శాసనసభ్యుడిని తమ వూరికి రోడ్డు ఎందుకు వేయడం లేదంటూ నిలదీయడం అసెంబ్లీ లాబీల్లో కలకలం రేపింది. దాని వివరాల్లోకి వెళ్తే... భోజన విరామ సమయంలో అసెంబ్లీ లాబీల్లో అధికార విపక్ష సభ్యులు ముచ్చటించుకొంటున్నారు. ఇంతలో నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గానికి చెందిన ఓ యువకుడు అక్కడికి చేరుకున్నాడు. తమ నియోజకవర్గ శాసనసభ్యుడు కె.సంజీవయ్యను తమ వూరికి రోడ్డు వేయడం లేదని నిలదీశాడు. దానికి ఆయన... ప్రభుత్వం నిధులిస్తే ఎందుకు వేయించను? అంటూ సమాధానం చెప్పారు.
దీనికి మరింత ఆగ్రహంతో ‘మీ నిధుల నుంచి ఇవ్వండి’ అంటూ ఆ యువకుడు కేకలు వేశాడు. దీనికి కొంత శాంతంగా ఆ ఎమ్మెల్యే ‘నిధులు ఎక్కడున్నాయి.. అవన్నీ ముఖ్యమంత్రి తీసి పారేశారుగా’ అని చెప్పారు. దాంతో ‘ముఖ్యమంత్రిని ఏమీ అనొద్దు’ అంటూ ఆ యువకుడు ఎమ్మెల్యేపైకి దూసుకెళ్లే ప్రయత్నం చేశాడు. అప్పటికే ఆ యువకుడి కేకలతో అక్కడికి చేరుకున్న ఇతర ఎమ్మెల్యేలు, ఉద్యోగులు అతనిని వారించారు. అయినా కేకలు వేస్తుండడంతో ఎమ్మెల్యే కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇద్దరూ గట్టిగా అరుచుకోవడంతో సెక్యూరిటీ వచ్చి అతనిని బయటకు పంపారు. అతను ఎవరు? ఏ పాస్ తో లోపలికి వచ్చాడు? కనీసం ఆ యువకుడి పేరేంటి? వంటి వివరాలు కూడా తెలియకపోవడంతో భద్రతా సిబ్బందిపై ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు.