: నా టీనేజ్ లో జయలలిత అంటే బాగా ఇష్టపడేవాడిని!: జస్టిస్ మార్కండేయ కట్జూ
దివంగత తమిళనాడు సీఎం, నటి జయలలిత అంటే కుర్ర వయసులో బాగా ఇష్టపడేవాడినని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ మార్కండేయ కట్జూ అన్నారు. ఈ మేరకు ఆయన తన ఫేస్ బుక్ ఖాతాలో పోస్ట్ చేశారు. తాను టీనేజ్ లో ఉన్నప్పుడు జయలలిత అంటే పడి చచ్చేవాడినని, ఆమె ఎంతో అందంగా ఉండేదని భావించే వాడిననని అన్నారు. 1948 ఫిబ్రవరి నెలలో జయలలిత జన్మించగా, 1946 సెప్టెంబర్ నెలలో తాను జన్మించానని పేర్కొన్నారు.
చెన్నైలోని రాజ్ భవన్ లో 2004 నవంబర్ లో మద్రాసు హైకోర్టు చీఫ్ జస్టిస్ గా తాను ప్రమాణ స్వీకారం చేసిన సమయంలో మొట్టమొదటి సారిగా మాజీ సీఎం జయలలితను కలిశానని చెప్పారు. అయితే, అప్పటికీ ఆమె చాలా అందంగా ఉన్నారని, ఆమె గురించి తన కుర్ర వయసులో ఉన్న భావాలను ప్రస్తావించలేదని, అది సరైన సమయం కాదని అన్నారు. ఈ సందర్భంగా జయలలిత నటించిన తమిళ సూపర్ హిట్ మూవీ ‘యార్ నీ?’లోని రొమాంటిక్ పాటను ఆయన పోస్ట్ చేశారు.