: 'ఆపరేషన్' అడ్డం తిరిగింది!
ఆపరేషన్ అడ్డం తిరిగింది! ఆకర్ష వికర్ష అయింది. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్లాన్ ఆయనకే రివర్సయింది! ఇటీవల కాలంలో పలు పార్టీల నుంచి వలసలను ప్రోత్సహించడంలో ఉదారస్వభావం కనబరుస్తున్న కేసీఆర్ కు దిమ్మదిరిగే షాక్ తగిలింది! మే నెలాఖరు నాటికి టీడీపీ పార్టీ ఖాళీ అవడం తథ్యమని పలు వేదికలపై ఢంకా బజాయిస్తోన్న ఈ గులాబీ కథానాయకుడు.. ఇప్పుడు పార్టీ శ్రేణులను కాపాడుకోవాల్సిన విచిత్ర పరిస్థితిలో చిక్కుకున్నాడు.
అందుకు నిదర్శనంగా ముగ్గురు టీఆర్ఎస్ నేతలు టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. నిన్న క్రమశిక్షణ చర్యల పేరిట చాడ సురేష్ రెడ్డి, దొమ్మాట సాంబయ్య, మేకల సారంగపాణిలపై వేటు వెనుక పెద్ద కథే నడిచింది. వీరు ముగ్గురూ టీఆర్ఎస్ ను వీడేలా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కథ నడిపించారని తెలుస్తోంది. తన నిరంకుశ వైఖరి పట్ల అసంతృతప్తి వ్యక్తం చేస్తోన్న ఆ ముగ్గురు బాబు ఆఫర్ ను అంగీకరించాన్న సమాచారం కేసీఆర్ చెవినబడిందని వినికిడి. ఈ నేపథ్యంలోనే వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేశారని రాజకీయ వర్గాలు అంటున్నాయి.
బాబుతో భేటీ వెంటనే సాంబయ్య టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి పదవికి రాజీనామా చేయడంతోనే టీఆర్ఎస్ గూటిలో గుబులు మొదలైంది. కాగా, సురేష్ రెడ్డి, సాంబయ్యలు ఉద్యమాల ఖిల్లా వరంగల్ జిల్లాకు చెందిన నేతలు కావడంతో అక్కడ టీఆర్ఎస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ ఖాయమని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.