: తమకు అడ్డు చెప్పిందని.. గ్రామస్థులంతా కలిసి మహిళను సజీవదహనం చేశారు!
రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. గ్రామస్థులంతా కలిసి ఓ మహిళను సజీవ దహనం చేశారు. ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె ఈ రోజు ఉదయం కన్నుమూసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పలు వివరాలు తెలిపారు. జోధ్‌పూర్‌లోని ఓ గ్రామంలో నిన్న రోడ్డు నిర్మాణ పనులు చేపట్టారు. అయితే, ఆ పనులకు లలిత అనే మహిళకు చెందిన పొలంలో చెట్లు అడ్డు రావడంతో వాటిని తొలగిస్తామని అన్నారు. చెట్లను తొలగించడానికి ఆమె ఒప్పుకోలేదు. దీంతో ఆగ్రహం తెచ్చుకున్న గ్రామస్థులు ఆమెపై దాడి చేసి, పెట్రోల్ పోసి నిప్పంటించారు. దీంతో ఆమె చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ కేసులో నిందితుల్లో గ్రామ సర్పంచ్ రణ్‌వీర్ సింగ్ కూడా ఉన్నారు. మొత్తం 10 మందిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.