: చెప్పాలనుకున్నది చెప్పలేకపోయిన ప్రభాస్!
గత రాత్రి హైదరాబాద్ శివార్లలోని రామోజీ ఫిలింసిటీలో ఏర్పాటు చేసిన వేదికపై 'బాహుబలి: ది కన్ క్లూజన్' ప్రీ రిలీజ్ వేడుక సాగుతున్న వేళ, హీరో ప్రభాస్ తాను చెప్పాలనుకున్న మాటలను చెప్పకుండానే వేదిక దిగాల్సి వచ్చింది. తనను పరిచయం చేస్తున్న వేళ, గాల్లోంచీ రోప్ సాయంతో వచ్చి సంభ్రమాశ్చర్యాలకు గురిచేసిన ప్రభాస్, అప్పుడేమీ మాట్లాడకుండా తరువాత మాట్లాడతానని చెప్పాడు. వాస్తవానికి ఈ కార్యక్రమానికి రాత్రి 9:30 గంటల వరకే పోలీసుల అనుమతి ఉండగా, రాజమౌళి ప్రసంగం మొదలయ్యే వరకే 10 గంటలు దాటింది. ఆపై ఆయన ఒక్కొక్కరినీ పేరు పేరునా అభినందిస్తుండగా, పోలీసు అధికారులు వచ్చి సమయం ముగిసిందని, వెంటనే కార్యక్రమాన్ని ముగించాలని సూచించారు. దీంతో రాజమౌళి తన ప్రసంగాన్ని నిలిపి, ప్రభాస్ కు మైక్ ఇచ్చారు. ప్రభాస్ ను కూడా త్వరగా ప్రసంగం ముగించాలని సూచించడంతో, రెండు డైలాగులు, రెండు ముక్కలు ముక్తసరిగా మాట్లాడి మైక్ ను తిరిగిచ్చేశాడు. ఆపై జరిగిన ఫైర్ క్రాకర్ షో అందరినీ అలరించగా, ఐదు నిమిషాల్లోనే కార్యక్రమం ముగిసింది.